మున్సిపల్ పోరుకు కొత్త ముహూర్తం!
నవంబర్ 1న పోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం... అక్టోబర్ 25న అభ్యర్థుల తుది జాబితా విడుదల... నవంబర్ 3న ఓట్ల లెక్కింపు.. మైదుకూరుకు మినహాయింపు...

విజయవాడ, అక్టోబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ తేదీని వాయిదా వేసింది. అక్టోబర్ 28న జరగాల్సిన ఎన్నికలను నవంబర్ 1న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మైదుకూరు మినహా రాష్ట్రంలోని 99 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 25న అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నారు. నవంబర్ 2న అవసరమైన చోట రీపోలింగ్, 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. నామినేషన్ల ప్రక్రియపై వచ్చిన ఫిర్యాదులు, సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో ఈ మార్పులు చేశారు. మైదుకూరులో తిరిగి నామినేషన్ల ప్రక్రియ చేపట్టిన తర్వాత ప్రత్యేకంగా పోలింగ్ తేదీ ప్రకటించనున్నారు. ఎన్నికల తేదీలు మారడంతో అభ్యర్థులు తమ ప్రచార ప్రణాళికలను సవరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

