భవానిపురంలో జిల్లా స్థాయి భూసార పరీక్షా ప్రయోగశాల
రూ.కోటి అంచనా వ్యయంతో 4 వేల చదరపు అడుగుల్లో భవన నిర్మాణం... ఎన్టీఆర్ జిల్లా రైతులకు భూసార పరీక్షలు, పంటల పోషకాలపై శాస్త్రీయ సూచనలు... నాణ్యతా ప్రమాణాలతో పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: ఎమ్మెల్యే సుజనా చౌదరి...

V10TV విజయవాడ, ఆగస్టు 13: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానిపురంలో నూతనంగా నిర్మించనున్న జిల్లా స్థాయి భూసార పరీక్షా ప్రయోగశాల భవనాన్ని నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకన్న, అసిస్టెంట్ ఇంజనీర్ శివరామకృష్ణ, కాంట్రాక్టర్ మండవ భార్గవ్ తదితరులు తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుజనా చౌదరిని కలిశారు. భూసార పరీక్షా ప్రయోగశాల భవన నిర్మాణ అంచనా వ్యయం, అనుమతులు, ఇతర అంశాలను ఎమ్మెల్యేకు వివరించారు.
ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని రైతులకు మట్టి పరీక్షలు నిర్వహించి భూమిలోని పోషక విలువలను నిర్ధారించేందుకు ఈ ప్రయోగశాల ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించనున్నట్లు వివరించారు.
ప్రయోగశాల అందుబాటులోకి వస్తే రైతులకు భూసార పరీక్షలు, భూమిలోని పోషకాల విశ్లేషణతో పాటు ఆయా పంటలకు అవసరమైన పోషకాలపై శాస్త్రీయ సూచనలు అందించేందుకు మరింత సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ భవన నిర్మాణంలో ఎక్కడా నాణ్యత విషయంలో రాజీపడవద్దని స్పష్టం చేశారు. సాంకేతిక నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టి, పటిష్టంగా నిర్మించడంతో పాటు నిర్ణీత సమయంలో పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

