77వ డివిజన్‌లో జోరుగా కూటమి ప్రచారం
ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం… రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి… ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు పిలుపు…

విజయవాడ, అక్టోబర్ 19: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 77వ డివిజన్‌లో ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచారం సోమవారం ఉత్సాహంగా సాగింది. సింగ్‌నగర్‌లోని లోనా సెంటర్ వినాయకుడి ఆలయం వద్ద ప్రారంభమైన ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి వీధుల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు. కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను బొండా సిద్ధార్థ అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా రహదారులు, పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయడం ప్రజాప్రతినిధుల బాధ్యతని పేర్కొన్నారు. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని సిద్ధార్థ అన్నారు. ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. 77వ డివిజన్ అభివృద్ధికి స్థానికుల సూచనలు, అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

