ధాన్యం అమ్మినా.. డబ్బులు రాలేదు!
సూరంపల్లి ఆర్బీకే వద్ద కౌలు రైతుల నిరసన 11 మంది రైతులకు రూ.6.80 లక్షలు రావాలంటూ ఆందోళన డీసీఎంఎస్ టెక్నికల్ అసిస్టెంట్‌పై కేసు.. పరారీలో ఉన్నట్లు అధికారుల వెల్లడి


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
కృష్ణాజిల్లా, గన్నవరం: గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలోని రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) వద్ద సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో కౌలు రైతులు నిరసన చేపట్టారు. ఆర్బీకేలో పంట నమోదు చేయించి, కొనుగోలు కేంద్రానికి ధాన్యం అందజేసినప్పటికీ తమకు రావాల్సిన సొమ్ము అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన 11 మంది రైతులకు మొత్తం రూ.6.80 లక్షల వరకు ధాన్యం కొనుగోలు సొమ్ము రావాల్సి ఉందని రైతులు తెలిపారు. తమ ధాన్యానికి సంబంధించిన చెల్లింపులను ఇతర రైతుల బ్యాంకు ఖాతాలకు మళ్లించి, అనంతరం ఆ డబ్బులను అధికారులు తీసుకున్నారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారంలో గ్రామ వ్యవసాయ సహాయకుడు, డీసీఎంఎస్‌కు చెందిన అధికారి పాత్రపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ అవకతవకలపై గతంలో గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పుడు డీసీఎంఎస్ టెక్నికల్ అసిస్టెంట్ మధు డబ్బులు తిరిగి చెల్లిస్తానని అంగీకరించినట్లు రైతులు పేర్కొన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించగా,

స్థానిక తహసీల్దార్ తప్పుడు నివేదిక ఇచ్చారంటూ ఆరోపించారు. అధికారులు స్పందించి తమకు రావాల్సిన ధాన్యం సొమ్మును వెంటనే ఇప్పించాలని కోరారు. వీఏఏ కోలవెన్ను దిలీప్ వివరణ రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం గతంలోనే విడుదల చేసిందని గ్రామ వ్యవసాయ సహాయకుడు కోలవెన్ను దిలీప్ తెలిపారు. డీసీఎంఎస్ టెక్నికల్ అసిస్టెంట్ చేసిన తప్పిదం కారణంగానే గ్రామానికి చెందిన 11 మంది రైతులకు సుమారు రూ.7 లక్షలు అందాల్సి ఉందని వివరించారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియ పూర్తిగా డీసీఎంఎస్ టెక్నికల్ అసిస్టెంట్ పరిధిలోనే ఉండేదన్నారు. కమీషన్‌కు ఆశపడి పక్క గ్రామాలకు చెందిన ధాన్యాన్ని కూడా సూరంపల్లి ఆర్బీకేకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ అవకతవకలపై టెక్నికల్ అసిస్టెంట్ మధుపై గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైందని, ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు, సంబంధిత శాఖల అధికారులు విచారణ జరిపి రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.

