చెప్పుల రుసుము పెంపు… ఎవరి ప్రయోజనం?
చెప్పుల స్టాండ్ రుసుమును రూ.3 నుంచి రూ.5కు పెంచే ప్రతిపాదనపై అభ్యంతరం సాధ్యమైనంతవరకు ఉచితంగా నిర్వహించాలని భక్తుడు కామరాజ్ హరీష్‌కుమార్ డిమాండ్ కాంట్రాక్టు, ఆదాయం, నిర్వహణ ఖర్చుల వివరాలను బహిర్గతం చేయాలని విజ్ఞప్తి

విజయవాడ, ఆగస్టు 31: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను దేవస్థానం అధికారులు పునఃపరిశీలించాలని అమ్మవారి భక్తుడు కామరాజ్ హరీష్‌కుమార్ డిమాండ్ చేశారు. దేవస్థానంలో ప్రస్తుతం చెప్పుల స్టాండ్‌ను కాంట్రాక్టర్ ద్వారా నిర్వహిస్తుండగా, దీనిద్వారా దేవస్థానానికి రూ.70 లక్షలకు పైగా ఆదాయం వస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం చెప్పుల జతకు రూ.3 వసూలు చేయాల్సి ఉండగా, ప్రస్తుత కాంట్రాక్టు గడువు ముగిసిన అనంతరం దేవస్థానమే నేరుగా నిర్వహిస్తూ జతకు రూ.5 వసూలు చేయాలనే ప్రతిపాదన తెరపైకి రావడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. నిబంధనల్లో రూ.3గా ఉన్న రుసుమును రూ.5కు ఎందుకు పెంచాల్సి వస్తోందో అధికారులు స్పష్టం చేయాలని కోరారు. దేవస్థానానికి ఇప్పటికే వివిధ మార్గాల్లో కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పుడు, చెప్పులు భద్రపరుచుకునే కనీస సౌకర్యానికీ భక్తులపై అదనపు భారం మోపడం సమంజసం కాదన్నారు. కాంట్రాక్టు నిర్వహణలో ఉల్లంఘనలు ఉంటే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, వర్కర్ల నియామకం లేదా నిర్వహణ ఖర్చుల పేరుతో ఆ భారాన్ని భక్తులపై మోపకూడదని అభిప్రాయపడ్డారు. పవిత్రమైన ఇంద్రకీలాద్రిని కేవలం ఆదాయ వనరుగా చూడకుండా భక్తుల సేవకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. చెప్పుల స్టాండ్‌ను సాధ్యమైనంతవరకు ఉచితంగా నిర్వహించాలని, జతకు రూ.5 వసూలు చేసే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చెప్పుల స్టాండ్ కాంట్రాక్టు విలువ, వసూలైన ఆదాయం, నిర్ణయించిన రుసుము, నిర్వహణ ఖర్చుల వివరాలను పూర్తి పారదర్శకతతో ప్రజల ముందుంచాలని కోరారు. “దేవస్థానం భక్తుల సేవ కోసం ఉండాలి... భక్తుల జేబులు ఖాళీ చేయడానికి కాదు. భక్తిపై అదనపు భారం మోపే ప్రతి నిర్ణయాన్ని అధికారులు పునఃపరిశీలించాలి” అని కామరాజ్ హరీష్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.

