81వ డివిజన్లో టీడీపీకి కొత్త బలం
పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే బొండా ఉమా… చంద్రబాబు నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని వెల్లడి… ప్రజాసేవ, పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపు…

విజయవాడ, అక్టోబర్ 19: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. నగరంలోని 81వ డివిజన్ ప్రశాంతినగర్కు చెందిన పలువురు సోమవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరారు. బీఆర్టీఎస్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పందిరి వాసు, పందిరి నాగమణి, పందిరి కిషోర్, పందిరి ఉమ, పందిరి మనీష్, జిల్లెళ్ల శివ తదితరులు పార్టీలో చేరారు. పందిరి వాసు, నాగమణికి ఎమ్మెల్యే బొండా ఉమా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ప్రజాపాలనకు ఆకర్షితులై వివిధ ప్రాంతాల నుంచి పార్టీలో చేరేందుకు ముందుకు రావడం సంతోషకరమని పేర్కొన్నారు. పేదలు, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తామని, అందరినీ కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేస్తామని బొండా ఉమా తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

