పసిబిడ్డకు పునర్జన్మ.. ‘జెస్సిక శ్రీ’గా పేరు పెట్టిన కమిషనర్
మృత్యువుతో పోరాడుతున్న పసిబిడ్డకు అండగా నిలిచిన ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య... ఎన్జీవోలు, ప్రభుత్వ సహకారంతో రూ.14 లక్షలు సమీకరించి చికిత్సకు చేయూత... కోలుకున్న చిన్నారికి ప్రేమగా ‘జెస్సిక శ్రీ’ అని నామకరణం చేసిన కమిషనర్...

ఖమ్మం, ఆగస్టు 17 (V10TV TS): మృత్యువుతో పోరాడుతున్న ఓ పసిబిడ్డ ప్రాణాలను కాపాడేందుకు ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య చూపిన చొరవ మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. చిన్నారి వైద్య చికిత్స కోసం అవసరమైన సహాయాన్ని సమకూర్చి కుటుంబానికి అండగా నిలిచారు.
ఎన్జీవోలు, ప్రభుత్వ సహకారంతో సుమారు రూ.14 లక్షలు సమీకరించి చిన్నారికి అవసరమైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. చికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యంగా కోలుకోవడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ నేపథ్యంలో చిన్నారి తల్లి తన బిడ్డను తీసుకుని ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి కమిషనర్ అభిషేక్ అగస్త్యను కలిశారు. చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకున్న కమిషనర్ ప్రేమతో ‘జెస్సిక శ్రీ’ అని పేరు పెట్టారు. తమ బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు సహకరించిన వారందరికీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

