సీఆర్డీఏ పరిధిలో అనుమతుల్లేని నిర్మాణం.. అధికారుల తీరుపై ప్రశ్నలు
పాఠశాల పక్కనే నిర్మాణం.. విద్యార్థుల భద్రతపై ఆందోళన ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటున్న స్థానికులు అనుమతులు ఉన్నాయా?.. తక్షణమే తనిఖీ చేయాలని అధికారులకు విజ్ఞప్తి

విజయవాడ ఆగస్టు 16: గొల్లపూడి సీఆర్డీఏ పరిధిలో అవసరమైన అనుమతులు లేకుండానే ఓ నిర్మాణం కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణానికి పక్కనే పాఠశాల ఉండటంతో విద్యార్థుల భద్రత విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై పాఠశాల యాజమాన్యం పలుమార్లు అభ్యంతరం తెలిపినప్పటికీ నిర్మాణ పనులు మాత్రం కొనసాగుతున్నాయని చెబుతున్నారు. నిర్మాణంపై ప్రశ్నించిన వారికి “ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండి” అన్న ధోరణిలో నిర్మాణదారుడు సమాధానం ఇస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో అసలు ఈ నిర్మాణానికి సీఆర్డీఏతో పాటు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఉన్నాయా? ఉంటే వాటి వివరాలేమిటి? నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణం జరుగుతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పాఠశాల పక్కనే నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారా? నిర్మాణ సమయంలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు అమలవుతున్నాయా? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఫిర్యాదులు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారా? నిర్మాణానికి సంబంధించిన అనుమతుల పత్రాలను పరిశీలించారా? అనే విషయాలపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఆరోపణల్లో వాస్తవమెంత ఉందో తేల్చేందుకు అధికారులు వెంటనే నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అనుమతులు ఉన్నట్లయితే వాటిని బహిర్గతం చేసి అనుమానాలకు తెరదించాలని, అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నట్లు తేలితే చట్టప్రకారం పనులను నిలిపివేసి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసి విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

