పశ్చిమ వైసీపీ అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ
మాజీ మంత్రి వెలంపల్లి చేతుల మీదుగా అభ్యర్థులకు బీ ఫారాలు… 31 నుంచి 58వ డివిజన్ వరకు కార్పొరేటర్ అభ్యర్థులకు అందజేత… కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు…

విజయవాడ, అక్టోబర్ 20: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు బీ ఫారాలను అందజేశారు. మంగళవారం బ్రాహ్మణ వీధిలోని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి 31 నుంచి 58వ డివిజన్ వరకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీ ఫారాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులందరూ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కులమతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించామని గుర్తుచేశారు. జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అభ్యర్థులకు సూచించారు. కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు విభేదాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని వెలంపల్లి కోరారు. ప్రతి డివిజన్లో పార్టీ బలోపేతంతో పాటు అభ్యర్థుల విజయానికి అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

